: రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వం హేళన చేయొద్దు: టి.టీడీపీ ఎమ్మెల్యేలు
తెలంగాణ ఏర్పడ్డాక 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని టి.టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు. వారి ఆత్మహత్యలను ప్రభుత్వం హేళన చేయవద్దని కోరారు. రైతులకు రూ.7 లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని, తక్షణమే కరవు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈరోజు టి.టీడీపీ ఎమ్మెల్యేలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. సుదీర్ఘ చర్చల తరువాత భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 14, 15 తేదీల్లో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలసి రాష్ట్రంలో రైతుల సమస్యలను విన్నవిస్తారు. బాధిత రైతు కుటుంబాలతో ఈ నెల 16న హెచ్ఆర్ సీని కలుస్తారు. రైతుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు వినతిపత్రం అందిస్తారు. ఈ నెల 18, 19, 20 తేదీల్లో ప్రాణహిత డిజైన్ మార్పును వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేస్తారు. ఈ నెల 21, 22 తేదీల్లో మెదక్, కరీంనగర్, నల్గొండ కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు.