: వాహన అమ్మకాలను కుదేలు చేస్తున్న ఉబెర్, ఓలా: ఆనంద్ మహీంద్రా
ఉబెర్, ఓలా వంటి యాప్ ఆధారిత టాక్సీ సేవలందిస్తున్న సంస్థల కారణంగా భారత వాహన పరిశ్రమలో అమ్మకాలు తగ్గనున్నాయని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఇండియాలో చాలా మంది కార్లలో ప్రయాణాలు చేయాలని కోరుకుంటున్నారు. కానీ కార్లను కొనుగోలు చేసేందుకు వారు ముందుకు రావడం లేదు. దీనికి కారణం ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు. రవాణా వ్యవస్థను కమోడిటీ మార్కెట్లో కలిపేసిన ఉబెర్, ఓలా వంటి కంపెనీలు ప్రజలు కార్లు కొనుగోలు చేసే అవసరం లేదని ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆక్షేపించారు. కార్ల యజమానులను ఈ సంస్థలు డ్రైవర్లుగా మారుస్తున్నాయని ఆయన విమర్శించారు. దీని వల్ల భవిష్యత్తులో కార్ల అమ్మకాలు తగ్గుతాయని, ముఖ్యంగా యువత కొత్త కార్ల కొనుగోలుకు దూరమవుతుందని అన్నారు. పలు ప్రాంతాల్లో ఆటో చార్జీలకన్నా తక్కువగా టాక్సీలు అందుబాటులో ఉన్నాయని గుర్తు చేసిన ఆయన, ఈ కంపెనీల మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు వాహన ఇండస్ట్రీపైనే ప్రభావం చూపుతోందని ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు.