: బిరబిరా కృష్ణమ్మ... నిండుతున్న శ్రీశైలం!
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయం నిండుకుండలా మారింది. తుంగభద్ర పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా, ప్రస్తుతం 1630 అడుగులకు నీటి మట్టం చేరింది. ఈ రిజర్వాయర్ కు 11,000 క్యూసెక్కులకు పైగా వరదనీరు వచ్చి చేరుతోంది. ఇక తుంగభద్ర ఉద్ధృతితో కృష్ణమ్మ పరుగు అందుకుంది. శ్రీశైలం జలాశయానికి ఒక్క రోజులో ఏడడుగుల ఎత్తు నీరు నిండుకుంది. మొత్తం నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 813 అడుగుల మేరకు నీరుంది. ఈ ఉదయం డ్యామ్ లోకి 58,200 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం నమోదైందని అధికారులు వివరించారు. ఇదే ప్రవాహం కొనసాగితే, నాలుగైదు రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి సహా, సాగుకు నీరందించడం ప్రారంభించవచ్చని, నాగార్జున సాగర్ కూ కొంత నీటిని తరలించే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.