: కేసీఆర్ చైనా వెళ్లడం వల్లే రాష్ట్రంలో వర్షాలు పడుతున్నాయి: పొన్నం చమత్కారం
తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా వెళ్లగానే రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ చమత్కరించారు. కొన్నాళ్లు ఆయన అక్కడే ఉంటే తెలంగాణలో మరింతగా వర్షాలు పడి పంటలు పండుతాయని ప్రజలంతా అనుకుంటున్నారని ఆయన అన్నారు. ఎటూ ఆయన చైనా నుంచి రాష్ట్రానికి వచ్చినా ఫాంహౌస్ నుంచే పరిపాలన చేస్తారు కాబట్టి అక్కడే ఉండటం మంచిదని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు హైదరాబాదులో విలేకరులతో పొన్నం మాట్లాడారు. ఇదే సమయంలో రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. రాష్ట్రంలో వందలమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదన్నారు. కేవలం 491 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న టీఆర్ఎస్ మంత్రి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో 55 మంది రైతు కుటుంబాలకే పరిహారం ఇచ్చారని మిగతా వారికి ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఏపీతో పోటీపడి ధనికరాష్ట్రమైన తెలంగాణ పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో రుణమాఫీ అమలుకానందునే రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని అన్నారు.