: ఫుట్ బాల్ వెంట హెచ్ సీఎల్, విప్రో... మరి ఇన్ఫోసిస్ దారెటో తెలుసా?


అంతర్జాతీయ ఐటీ మార్కెట్లోకి మరింతగా చొచ్చుకుపోవాలని భావిస్తున్న దిగ్గజ కంపెనీలు, అందుకోసం క్రీడలను ఎంచుకుంటున్నాయి. హెచ్ సీఎల్, విప్రో సంస్థలు ఇప్పటికే ఫుట్ బాల్ ఫ్రాంచైజీలతో డీల్స్ కుదుర్చుకున్నాయి. హెచ్ సీఎల్ సంస్థ మాంచెస్టర్ యునైటెడ్ తో, విప్రో చెల్సియాతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాలో రెండవ అతిపెద్ద సాఫ్ట్ వేర్ సేవల సంస్థగా ఉన్న ఇన్ఫోసిస్ టెన్నిస్ ను ఎంచుకుంది. ఈ మేరకు 'ఏటీపీ'తో జతకట్టింది. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఏటీపీ వరల్డ్ టూర్ టోర్నమెంటులకు క్లౌడ్, అనలిటిక్స్ తదితర ఐటీ సేవలను అందించేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సంవత్సరం ఏటీపీ సీజన్ లో చివరిదైన బార్క్లేస్ నుంచి తదుపరి మూడేళ్ల పాటు ఈ ఒప్పందం అమలవుతుంది. ఏటీపీ ప్లేయర్ జోన్, ఓ మొబైల్ యాప్, టోర్నమెంట్ రిజిస్ట్రేషన్స్, ఆటగాళ్ల ప్రయాణాలకు సంబంధించిన సమాచార విశ్లేషణ తదితరాలన్నీ ఇన్ఫీ పర్యవేక్షిస్తుంది. కాగా, ఏటీపీ వరల్డ్ టూర్ లో భాగంగా 31 దేశాల్లో 62 టెన్నిస్ టోర్నమెంట్లు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, ఈ మూడు కంపెనీలకు ప్రధాన పోటీదారుగా ఉన్న టీసీఎస్ ఇప్పటికే పలు మారథాన్ పోటీలకు స్పాన్సరర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూయార్క్, ఆమ్ స్టర్ డామ్, బెంగళూరు తదితర నగరాల్లో జరిగిన మారథాన్ పోటీలకు టీసీఎస్ స్పాన్సరర్.

  • Loading...

More Telugu News