: రైతులకు అండగా కోమటిరెడ్డి... బాధిత కుటుంబాలకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా రూ.50 వేల సాయం
తెలంగాణలో నానాటికీ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. రైతుల ఆత్మహత్య ఘటనలు లేని రోజంటూ లేదు. మొన్న ఒకే రోజు పది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడిన వైనం రాష్ట్రంలో సాగు దుస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు అండగా నిలవడంతో పాటు తీవ్ర నిరాశా నిస్పృహల్లో కూరుకుపోయిన రైతుల్లో భరోసా నింపేందుకు నల్లగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి త్వరలో ప్రత్యేక యాత్ర చేపట్టబోతున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు తనవంతుగా రూ.50 వేల చొప్పున సాయం అందించనున్నట్లు ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. తన కొడుకు ప్రతీక్ రెడ్డి పేరిట నెలకొల్పిన ప్రతీక్ ఫౌండేషన్ పేరిట ఈ సాయాన్ని అందించనున్నట్లు కోమటిరెడ్డి ప్రకటించారు.