: షీనా బోరా కేసులో ఊహించని ట్విస్ట్... ఇక కథ కంచికేనా?


అది మూడేళ్ల నాడు జరిగిన ఓ హత్య. ఓ దుర్మార్గపు తల్లి చేసిన ఘాతుకం. చాలా కాలం తరువాత వెలుగులోకి వచ్చింది. మృతదేహం లేదు కాబట్టి, కోర్టులో కేసు వీగిపోయే అవకాశాలే ఎక్కువ. మామూలుగా అయితే, ఈ కేసులో ఓ సీఐ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తారు. కానీ, షీనా బోరా హత్య కేసు వేరు. ఇండియాలో మీడియా మొఘల్ గా అభివర్ణించే పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి, ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండటంతో కార్పొరేట్ భారతావని మొత్తం ఆసక్తి చూపింది. ఓ పది రోజుల పాటు దేశవ్యాప్త మీడియాలో ఈ ఉదంతంపై కథనాలు వెల్లువెత్తాయి. క్షణక్షణం విచారణ ఎలా సాగుతుందో చెప్పుకొచ్చాయి. ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా స్వయంగా నిందితులను ఇంటరాగేట్ చేశారు. రోజుల తరబడి ఈ కేసుపై దృష్టి పెట్టారు. కేసులో చిక్కుముడులను విప్పేందుకు ఎంతో శ్రమించారు. కానీ, ఇంద్రాణి భర్త పీటర్ పై విచారణలో భాగంగా కాస్తంత లోతుగా ప్రశ్నలు వేసిన మరుసటి రోజే 'ప్రమోషన్' పేరిట ఆయన బదిలీ అయ్యారు. పీటర్ ముఖర్జియా సంస్థలో ఆర్థిక లావాదేవీలు, ఐఎన్ఎక్స్ మీడియా కంపెనీ వివరాలు, ఇతర కంపెనీల్లో ఇంద్రాణి పాత్ర, వారి సంస్థలపై సెబీలో ఉన్న కేసులు, ఈడీ విచారణ తదితరాలపై ఆయన్ను ప్రశ్నించిన తరువాత బదిలీ ఉత్తర్వులు వెలువడటం కాకతాళీయం అయినా, కాకున్నా, కేసును ఓ కొలిక్కి తెచ్చిన ఆ అధికారి, దర్యాప్తులో ఇకపై భాగం పంచుకోలేరు. ఇంద్రాణి కేసును ఆయన పర్యవేక్షించవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ, జరిగిన పరిణామాలు రాకేష్ మారియాకు వేదన కలిగించాయి. ఇక ఈ కేసులో తన ప్రమేయం ఉండదని ఆయన తేల్చి చెప్పేశారు. గడచిన రెండు మూడు వారాలుగా కేసును విచారిస్తున్న ఖర్ పోలీసు స్టేషన్ ఎదుట, లైవ్ కెమెరాలతో సిద్ధంగా ఉన్న రిపోర్టర్లు, ఓబీ వాహనాలు, ప్రత్యేక మీడియా పాయింట్... ఇలాంటివేవీ ఇప్పుడక్కడ లేవు. మీడియా సందడంతా ముగిసింది. ఈ కేసు విచారణ కొనసాగుతుందని తాజా కమిషనర్ అహ్మద్ జావేద్ వెల్లడించినా, దర్యాప్తు నిదానించిందన్నది పచ్చి నిజం. ఇంద్రాణి ఇప్పుడు జైల్లో ఉంది. మరికొన్ని రోజుల్లో ఎలాగూ బెయిల్ వస్తుంది. ఆపై కొన్నేళ్ల పాటు కేసు సాగుతుంది. కథ కంచికి చేరుతుందా? లేక షీనా బోరా హత్యకు కారకులైన వారికి సరైన శిక్ష పడుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కాలమే చెప్పాలి. ఇప్పటికి మాత్రం కేసు అటకెక్కినట్టే. ఎందుకంటే... ముంబై పోలీసులు, ముఖ్యంగా ఈ కేసును ఆది నుంచి ఫాలో అప్ చేసిన అధికారులు ఇప్పుడు గణేష్ ఉత్సవాల భద్రతలో బిజీగా ఉన్నారు కాబట్టి!

  • Loading...

More Telugu News