: ‘సీమ’కు, పట్టిసీమకు సంబంధమేంటి?... ఉండవల్లి సూటి ప్రశ్న
రాయలసీమకు, పట్టిసీమ ప్రాజెక్టుకు మధ్య సంబంధం ఏమిటో తనకు అర్థం కావడం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. కొద్దిసేపటి క్రితం హైదరాబాదులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఉండవల్లి, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజలను మభ్యపెట్టడానికే ప్రభుత్వం పట్టిసీమకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. తాను చంద్రబాబుకు వ్యతిరేకం కాదంటూనే, చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టిసీమపై ఘాటు విమర్శలు చేశారు. వాస్తవానికి పట్టిసీమకు, రాయలసీమకు ఎలాంటి సంబంధం లేదని ఉండవల్లి పేర్కొన్నారు. జేబులు నింపుకోవడానికే పట్టిసీమను ప్రారంభించారని ఆయన ఆరోపించారు. అయినా తాత్కాలిక ప్రాతిపదికగా చేపట్టిన ప్రాజెక్టును చంద్రబాబు జాతికి అంకితమివ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకవేళ ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాతైనా జాతికి అంకితమిచ్చారా? అంటే, అదీ లేదని ధ్వజమెత్తారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జాతికి అంకితమెలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తాటిపూడి ప్రాజెక్టుకు చెందిన నీటిని కృష్ణా నదిలో కలిపి, పట్టిసీమ నీటిని నదిలో కలిపినట్లు కలరింగ్ ఇచ్చారని ఆయన మండిపడ్డారు.