: 2.3 కోట్ల మందిని ఆకర్షించిన 'లేటు వయసు ఘాటు ప్రేమ'!
ఈ ప్రపంచంలో ప్రేమ లేదని వాదించే వారికి కనువిప్పు కలిగించే ఘటన ఇది. అమెరికన్ సంగీత దర్శకుడు క్రిస్ జీక్యూ పెర్రీ తనకు లాస్ ఏంజిల్స్ విమానాశ్రయంలో కనిపించిన ఓ దృశ్యాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టగా 2.3 కోట్ల మంది చూసేశారు. దీర్ఘకాలం పాటు దూరంగా ఉన్న భార్యాభర్తలు బెర్నార్డ్ మిల్స్ (80), కారోలిన్ ఓగ్డెన్ (75) కలుసుకున్న వేళ... వారిలో భావోద్వేగాలు, నిజమైన ప్రేమ వ్యక్తమైన విధానం, ప్రేమను ద్వేషించే వారిని కూడా ప్రేమలో పడేసేలా వున్నాయి. ఎయిర్ పోర్టు ప్రవేశద్వారం వద్ద పూలబొకేతో నిలబడ్డ మిల్స్ వైఖరి ఎందుకో క్రిస్ ను ఆకర్షించింది. దీంతో ఎవరికోసం ఎదురుచూస్తున్నాడో తెలుసుకునేందుకు సిద్ధమయ్యాడు. గేటులో నుంచి ఓ పెద్దావిడ బయటకు రాగానే, ఆయన కళ్లు వెలిగిపోయాయి. ఇద్దరూ కళ్లతోనే పలకరించుకుంటూ దగ్గరగా చేరారు. క్షణమాత్రం ఆలస్యం లేకుండా ఆవిడ, ఆయన్ను గట్టిగా హత్తుకుపోయింది. గాఢంగా కిస్ చేసింది. ఆ క్షణం అక్కడున్న వారి మనసులు కదిలిపోయాయి. అప్పటికి వారెవరో క్రిస్ కు తెలియదు. తెలీకుండానే వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. ఆపై ఈ వృద్ధ జంట తామంతట తామే బయటకు వచ్చి, ఈ వీడియో వెనుక కథను వెల్లడించారు. ఆమె రెండు వారాల క్రితం ఓ వివాహం నిమిత్తం డెలావర్ వెళ్లిందని, ఆ మాత్రం ఎడబాటును కూడా తాను తట్టుకోలేనని మురిపెంగా చెప్పారు. తామిద్దరికీ ఒకరిపై ఒకరంటే అవ్యాజమైన ప్రేమ ఉందని, తానెన్నో చిలిపి పనులు చేస్తుంటానని మిల్స్ తెలిపారు. "ఎవరికి ఏం అవసరమో మా ఇద్దరికీ తెలుసు. ఆమెకు నచ్చే పనులనే చేసేందుకు నేను ప్రయత్నిస్తుంటాను. కిచన్ లో వంట చేసేటప్పుడు అకస్మాత్తుగా వెళ్లి కౌగిలించుకుని ముద్దు పెడతాను. టీవీ చూస్తుంటే షడన్ గా వెళ్లి సర్ ప్రైజ్ ఇస్తాను. ప్రతి రాత్రీ నిద్రించే ముందు తనకు ముద్దు పెట్టి గుడ్ నైట్ చెప్పకుండా ఉండే సమస్యే లేదు" అంటున్నారు. ఇంతకీ వీళ్లిద్దరూ తొలిసారిగా ఎప్పుడు కలుసుకున్నారో తెలుసా? 2007లో మాత్రమే. వీరికి వివాహమై 5 సంవత్సరాలు మాత్రమే అయింది. ఇద్దరికీ తమ తమ మొదటి జీవిత భాగస్వాములు దూరమయ్యారు. పరిచయమైన తరువాత రెండేళ్ల పాటు సెల్ ఫోన్లే మాధ్యమంగా టెక్ట్స్ మెసేజ్ లు, చిలిపి ఊసులతో ఇద్దరూ దగ్గరయ్యారట. ఇప్పుడీ 'లేటు వయసు ఘాటు ప్రేమ', వారి వీడియో, మిల్స్ ప్రేమకబుర్లు యువ నెటిజన్లకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.