: సబ్ కామ్ గవర్నమెంట్ కరేగా...హమ్ బేకార్ బైఠేగా!: వెంకయ్య నాయుడు
స్వచ్ఛ భారత్ లో ప్రజలంతా పాల్గొనాలని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ లో స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్లకు తేనీటి విందు ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కీర్తి, ప్రతిష్ఠలున్న చాలా మంది స్వచ్ఛ భారత్ లో పాల్గొన్నారని అన్నారు. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరూ వివిధ రంగాల్లో 'విద్యాసంస్థ' లాంటి వాళ్లని కొనియాడారు. కానీ దేశ ప్రజల తీరు ఎలా ఉందంటే 'సబ్ కామ్ గవర్నమెంట్ కరేగా... హమ్ బేకార్ బైఠేగా' (మొత్తం పనంతా గవర్నమెంటే చేస్తుంది...మనం తీరిగ్గా కూర్చుందాం) అన్నట్టు ఉందని ఆయన మండిపడ్డారు. ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ కార్యక్రమమూ విజయవంతం కాదని ఆయన స్పష్టం చేశారు. మన దేశాన్ని మనమే శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, దిగ్గజ నటుడు కమల్ హాసన్, అమల అక్కినేని, తమన్నా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీ, రామోజీరావు, నరేంద్ర చౌదరి, టీవీ నటుడు కపిల్ శర్మ, బాబా రాందేవ్, కాంగ్రెస్ నేత శశిథరూర్ తదితరులు పాల్గొన్నారు.