: అద్వానీ, జోషీలను పక్కనబెట్టిన బీజేపీ!


బీజేపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీహార్ ఎన్నికల్లో ప్రచారానికి పార్టీ సీనియర్ నేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను పక్కన బెట్టారు. వీరితో పాటు బాలీవుడ్ నటుడు, స్థానిక నేత శత్రుఘ్న సిన్హా పేరు సైతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రచారకర్తల జాబితాలో లేదు. దాదాపు పదేళ్ల తరువాత బీజేపీని తిరిగి అధికారంలో నిలిపిన నరేంద్ర మోదీ, బీహార్ ఎన్నికల ప్రచార బాధ్యతలను తన భుజస్కంధాలపైనే వేసుకుని ప్రజల ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఆయనకు కొందరు నేతలు సహాయకులుగా ఉంటారని సమాచారం. "బీజేపీ ముఖ్య ప్రచారకర్తలుగా 40 మందిని ఎంపిక చేశాం. ఇందులో అద్వానీ, జోషీ, సిన్హాల పేర్లు లేవు" అని బీజేపీ నేత ఒకరు వివరించారు. బీహార్ రాష్ట్ర చరిత్రలో అద్వానీ ప్రచారం లేకుండా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. నరేంద్ర మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్, సుష్మా, అరుణ్ జైట్లీ, రాధా మోహన్ సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, గిరిరాజ్ సింగ్, మనోహర్ పారికర్, అనంత్ కుమార్, ధర్మేంద్ర ప్రధాన్ లు 'స్టార్ క్యాంపెయినర్లు' గా ఉంటారని పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఆ నేత వెల్లడించారు. ప్రధాన ప్రచారకర్త మాత్రం మోదీయేనని ఆయన అన్నారు. బీహార్ లో తొలి దశ ఎన్నికలు ప్రారంభమయ్యే అక్టోబర్ 12లోగా డజనుకు పైగా 'పరివర్తన్' ర్యాలీలు జరుగుతాయని వివరించారు.

  • Loading...

More Telugu News