: నదుల అనుసంధానం కాదు... 'నిధుల' అనుసంధానం జరిగింది!: అంబటి రాంబాబు


గోదావరి జలాలు కృష్ణాజిల్లాలోకి ప్రవేశించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపణలు చేశారు. నదుల అనుసంధానం పూర్తయిపోయిందని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. జరిగింది నదుల అనుసంధానం కాదని, టీడీపీ ఆఫీసుకు 'నిధుల' అనుసంధానం జరిగిందని అంబటి ఆరోపించారు. అసలు సాగునీటి ప్రాజెక్టులు చిత్తశుద్ధితో పూర్తి చేసిన చరిత్ర బాబుకు లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్టును ఏనాడు పట్టించుకోలేదని, దానిని పూర్తి చేయడానికి వైఎస్ పట్టుదలతో కృషి చేశారని తెలిపారు. ఎవరో చేసిన పనిని తాను చేశానని చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గు చేటని మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇక పులిచింతల ప్రాజెక్టును కూడా తానే పూర్తి చేశాననడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదేమైనా తనను తాను మార్కెట్ చేసుకోవడంలో చంద్రబాబు నెంబర్ వన్ అని ఎద్దేవా చేశారు. పట్టిసీమ ప్రాజెక్టు పూర్తికాకుండానే జాతికి అంకితం చేసి ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News