: ముంబయిలో ముదురుతున్న 'మాంసం' లొల్లి
జైనులు పవిత్రంగా భావించే 'పర్యుషాన్' సందర్భంగా మాంసం విక్రయాలపై నిషేధం విధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తొలుత ఎనిమిది రోజుల పాటు నిషేధం విధించాలని నిర్ణయించినప్పటికీ... చివరకు పలువురితో చర్చించిన అనంతరం నిషేధాన్ని నాలుగు రోజులకు పరిమితం చేశారు. దీనిపై శివసేన మండిపడింది. ఎవరు ఏమి తినాలో నిర్ణయించే హక్కు ఎవరికీ లేదంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని శివసేన బహిరంగంగానే వ్యతిరేకించింది. ఇప్పుడు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) మరో అడుగు ముందుకు వేసి, మాంసం అమ్మకాలను తామే స్వయంగా చేపడతామని ప్రకటించింది. ముంబయిలోని దాదర్ ప్రాంతంలో ఉన్న అగర్ బజార్ వద్ద తమ కార్యకర్తలతో మాంసం విక్రయాలను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. దీంతో, ముంబయిలో మాంసం విక్రయాల అంశం రాజకీయ రంగు పులుముకున్నట్టు అయింది.