: ఇండియాలో ఉన్న 'పెను విధ్వంసక' బాంబులపై పాక్ లెక్కలివే!
ఇండియా వద్ద ఎన్ని 'వార్ హెడ్స్' ఉన్నాయి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం సైన్యంలోని అత్యున్నత వర్గాలకు చెందిన కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. కానీ, ఇండియా వద్ద పెను విధ్వంసాన్ని సృష్టించగల బాంబుల సంఖ్యపై పాకిస్థాన్ లెక్కలు కట్టింది. భారత్ వద్ద 2 వేలకు పైగా వార్ హెడ్స్ ఉన్నాయని పాక్ పత్రిక 'డాన్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయాన్ని ఎన్సీఏ (నేషనల్ కమాండ్ అథారిటీ) అధికారులు వెల్లడించినట్టు పేర్కొంది. ఇండియా శరవేగంగా అణ్వస్త్రాలను పెంచుకుంటోందని, అందువల్లే ఇదే రీజియన్ లో ఉన్న పాకిస్థాన్ సైతం ఆ దిశగా అడుగులు వేయక తప్పడం లేదని వెల్లడించింది. రియాక్టర్ కు, ఆయుధాలకు వినియోగించే ప్లూటోనియం గ్రేడ్ వెపన్స్ సంఖ్య ఇండియాలో భారీగా ఉందని తెలిపింది. "న్యూఢిల్లీ ప్లూటోనియం స్టాక్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. 0.8 టన్నుల నుంచి 15 టన్నుల వరకూ బరువైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది" అని ఆ కథనంలో పేర్కొంది. కాగా, వచ్చే పదేళ్లలో ప్రపంచంలోనే అణ్వస్త్రాలను అధికంగా కలిగిన దేశంగా పాకిస్థాన్ నిలుస్తుందని యూఎస్ విశ్లేషణ సంస్థ 'కార్నేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్' అంచనా వేసిన సంగతి తెలిసిందే.