: షీనా బోరా కేసు దర్యాప్తు పర్యవేక్షించలేను...‘మహా’ సర్కారుకు తేల్చిచెప్పిన మారియా
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా కేసు దర్యాప్తును ఇకపై పర్యవేక్షించలేనని మహారాష్ట్ర టాప్ కాప్ రాకేశ్ మారియా ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పారు. షీనా బోరా కేసును స్వయంగా పర్యవేక్షించిన రాకేశ్ మారియా, కేసును స్వల్ప వ్యవధిలోనే ఓ కొలిక్కి తీసుకురాగలిగారు. ఈ నేపథ్యంలో ఉన్నపళంగా మారియాను ముంబై పోలీస్ కమిషనర్ పదవి నుంచి ఫడ్నవీస్ సర్కారు బదిలీ చేసింది. ఆ స్థానంలో అహ్మద్ జావెద్ అనే డీజీపీ స్థాయి అధికారిని నియమించింది. అంతేకాక అహ్మద్ జావెదే షీనా కేసు దర్యాప్తును పర్యవేక్షిస్తారని తెలిపింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం, బదిలీ అయినా రాకేశ్ మారియానే ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు చేపడతారని మాట మార్చింది. అప్పటికే బదిలీపై అసంతృప్తితో ఉన్న రాకేశ్ మారియా సర్కారుకు షాకిచ్చారు. ‘‘ముంబై పోలీస్ కమిషనర్ గా ఒకరిని నియమించిన తర్వాత సమాన హోదా కలిగిన మరో అధికారితో కేసు దర్యాప్తు పర్యవేక్షించమనడం సమంజసం కాదు. ఇలా చేస్తే ముంబై పోలీసు వ్యవస్థలో కొత్తగా మరో పవర్ సెంటర్ ఏర్పడే అవకాశం ఉంది. కింది స్థాయి సిబ్బందికి తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముంది’’ అని మారియా సర్కారుకు చెప్పారట.