: 'బ్యాంకుల్లో రూపాయి ఉంచొద్దు'... ఆర్థిక సహాయ నిరాకరణ పేరిట పటేళ్ల కొత్త ఉద్యమం
గుజరాత్ లో రిజర్వేషన్ల కోసం ఉద్యమిస్తున్న పటేళ్ల వర్గం, మరో కీలక అడుగేసింది. రాష్ట్రవ్యాప్తంగా పటేళ్లు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులన్నీ వెనక్కు తీసుకోవాలని, తద్వారా ఆర్థిక సహాయ నిరాకరణ మొదలు పెట్టాలని ఉద్యమ నాయకులు పిలుపునిచ్చారు. అమెరికాలో జరిగే మోదీ పర్యటనకు అక్కడి పటేళ్లెవరూ హాజరు కాకూడదని తీసుకున్న నిర్ణయాన్ని ‘సర్దార్ పటేల్ బృందం’ స్వాగతించింది. పటేళ్లకు రిజర్వేషన్ల కోటా విషయంలో గుజరాత్ సర్కారు మొండి వైఖరిని ప్రదర్శిస్తోందని వారు విమర్శించారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించామని, అందుకే బ్యాంకుల్లోని డబ్బులను వెనక్కి తీసేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చామని పటేళ్ల బృందం ప్రతినిధి వరుణ్ పటేల్ వ్యాఖ్యానించారు. సగటున ప్రతి పటేల్ కూ రూ.50 వేల చొప్పున మొత్తం 350 కోట్ల రూపాయల విలువైన 70 లక్షల ఖాతాలు బ్యాంకుల్లో ఉన్నాయని ఆయన అన్నారు. ఇదిలావుండగా, ఈ పని వెర్రిదని గుజరాత్ వాణిజ్య మండలి అభిప్రాయపడింది. ఇలా చేస్తే, రాష్ట్రంతో పాటు ఖాతాదారులు కూడా ఇబ్బందుల్లో పడతారని తెలిపింది.