: నెల్లూరు జిల్లాలో టీచర్ కిడ్నాప్... రూ.20 లక్షలు డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు
నెల్లూరు జిల్లాలో నిన్న సాయంత్రం జరిగిన ఓ ఉపాధ్యాయుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో రామకృష్ణారెడ్డి అనే ఉపాధ్యాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి కిడ్నాప్ చేశారు. దొరవారిసత్రం మండలం మంగనెల్లూరు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అపహరణ అనంతరం దుండగులు అతడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి రూ.20 లక్షలు డిమాండ్ చేశారట. 'నిర్దేశించిన సొమ్మును రెడీ చేసుకోండి, మళ్లీ ఫోన్ చేస్తా'మంటూ దుండగులు చెప్పడంతో బెంబేలెత్తిన రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు వెనువెంటనే పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.