: ఆమెకు భర్త కంటే శునకాలే ఎక్కువట!
బెంగళూరు పోలీసుల ముందుకు చిత్రమైన సమస్య వచ్చింది. హెచ్ఎస్ఆర్ లే అవుట్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కేరళకు చెందిన ఓ యువతిని ఏడాది క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమె కాపురానికి వస్తూ తన వెంట పుట్టింటి నుంచి లాబ్రాడర్ జాతికి చెందిన రెండు పెంపుడు శునకాలను తెచ్చుకుంది. భార్యామణికి పెంపుడు జంతువులంటే ఉన్న ప్రేమను చూసి ఆ భర్త సంతోషించాడు. కాలక్రమంలో అదే తనకు ఇబ్బందులు తెచ్చిపెడుతుందని అప్పుడు ఊహించలేదాయన. కుక్కలకు భార్య ఇస్తున్న ప్రాముఖ్యత ఆయనకు అగ్రహం తెప్పించింది. బెడ్ రూంలో కూడా కుక్కలు తనతోపాటే పడుకోవాలని మంకుపట్టు పడుతున్న భార్యను ఎలా సముదాయించాలో తెలియని సదరు యువకుడు తన తల్లికి విషయం వివరించాడు. దీంతో ఆమె అత్తగారు పెద్దరికంతో కొత్త ప్రదేశంలో సర్దుకునేందుకు సమయం పడుతుందని కుమారుడికి సర్ది చెప్పింది. ఏడాది ముగిసినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాకపోవడంతో తాను కావాలో, కుక్కలు కావాలో తేల్చుకోవాలని ఆయన స్పష్టం చేశాడు. దీంతో ఆమె తడుముకోకుండా కుక్కలే కావాలి, భర్త వద్దని తెలిపింది. దీంతో ముక్కున వేలేసుకున్న తల్లి, కొడుకు కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కౌన్సిలింగ్ కేంద్రానికి ఆ సమస్యను సిఫారసు చేశారు. సుదీర్ఘ కాలం భార్యాభర్తలతో మంతనాలు జరిపిన పోలీసులు వారికి ఎలా సర్ది చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకున్నారు. దీంతో వారిద్దరూ విడిపోయేందుకు సిద్ధమయ్యారు. దీంతో న్యాయస్థానానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. న్యాయస్థానం ఏం చెబుతుందో చూడాలి.