: వ్యవసాయ శాఖ మంత్రి నడవలేని పరిస్థితిలో ఉన్నారు: రేవంత్ రెడ్డి
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేస్తున్న హత్యలని టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు లింబయ్య కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రైతులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు రైతులను పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి నడవలేని స్థితిలో వైద్యం చేయించుకుంటున్నారని, ఆయన గురించి ఏం మాట్లాడినా ప్రయోజనం లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ఉంటే 1300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొని ఉండేది కాదని ఆయన తెలిపారు. రైతు ఆత్మహత్యలపై కేసీఆర్, హరీష్ రావులపై కేసులు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.