: ఏకే-47లకు పూజలు, ఆపై తలలు తెగ్గోయడంపై క్లాసులు...ఇదీ ఐఎస్ఐఎస్ ట్రైనింగ్ తీరు!
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, తాము పట్టుకున్న బందీల తలలను నిర్దయగా తెగ నరుకుతారని తెలుసు. చిన్నారులతో తలలు తెగ్గోయిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. కానీ వారికి తలలు నరకడంపై ఎలా శిక్షణ ఇస్తున్నారు? చిన్నారులను ఉగ్రవాదులుగా ఎలా మారుస్తున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నాడు, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చెర నుంచి పారిపోయి వచ్చిన యాజిడి వర్గానికి చెందిన 14 ఏళ్ల యువకుడు రఘాబ్ అహ్మద్. ఐఎస్ఐఎస్ కిడ్నాప్ చేసి తెచ్చిన కుటుంబాల్లోని చిన్నారులను, పురుషులను శిక్షణకు పంపుతారు. ఆపై మహిళలు, బాలికలను లైంగిక బానిసలుగా చేస్తారు. శిక్షణకు వెళ్లిన వారికి తెల్లవారుఝామున 4 గంటల నుంచి దినచర్య మొదలవుతుంది. మొట్టమొదట ఏకే-47 తుపాకుల ముందు ప్రార్థనలు చేయాలి. ఆ తరువాత ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ పాఠాలు చెబుతారు, ఆపై సాయంత్రం 5 గంటల వరకూ శిక్షణ ఉంటుంది. ఇందులో భాగంగా "తలను పైకెత్తి పట్టుకోవాలి. వెనక్కు లాగాలి, మెడ మీదుగా..." అంటూ ట్రైనింగ్ ఇస్తారు. ఇలా చేస్తే రాటుదేలుతారని అంటూ, శరీరంపై నుంచి నడిచి వెళతారు. ఏ ఆయుధాన్ని ఎలా వాడాలో చెబుతారు. తల్లిదండ్రులను కూడా ద్వేషించేలా మనసులు మార్చుతారు. కాగా, ఓ ఫైటర్ వద్ద నుంచి తాను దొంగిలించిన ఉగ్రవాదుల కార్యకలాపాలకు చెందిన ఎవరూ చూడని ఫోటోలు సైతం రఘాబ్ బయటపెట్టాడు.