: 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' ఫేస్ బుక్ లో అందర్నీ ఆకట్టుకున్న వ్యక్తి కథ
'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' పేరిట ఫేస్ బుక్ ఖాతాను కొందరు ఔత్సాహికులు నడిపిస్తున్నారు. ఈ ఫేస్ బుక్ లో బాంబే వాసుల కథలు, వ్యథలు పోస్టు చేయవచ్చు. ఓ యువకుడి కథ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. పుట్టుమూగ, వినికిడి సమస్యతో బాధపడుతున్న యువకుడు జీవితంలో ఎన్నో కష్టాలు చవి చూశాడు. ఉద్యోగం కోసం తిరిగితే ఏం చేస్తావు? ఎలా చేస్తావు? అంటూ ప్రశ్నించేవారు. అవతలి వారి ప్రశ్న అర్థమైనా తన సమాధానం అర్థం కాని పరిస్థితి, చేతిలో చిల్లిగవ్వ ఉండేది కాదు. గత ఏడాది ఓ కిచెన్ లో పనిచేసే అవకాశం వచ్చింది. అక్కడి అనుభవం అతడిని షెఫ్ గా తీర్చిదిద్దింది. అక్కడ ఎవరితోనూ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, అతని పనే అందరితోనూ మాట్లాడిస్తుంది. ఈ క్రమంలో ఆ యువకుడు దాదర్ మార్కెట్లో వెళ్తుండగా ఓ యువతిని చూశాడు. చూడగానే ప్రేమించాడు. కానీ మౌనంగా ఉండిపోయాడు. ఇంతలో గత ఏప్రిల్ లో అతని స్నేహితుడు 'ట్రైన్ లోని హ్యాండీకాప్డ్ బోగీలో ఓ యువతిని చూశాను. నీ గురించి చెప్పాను, ఆమె అయితే నీకు సరిగ్గా సరిపోతుంది' అంటూ ఓ ఫోన్ నెంబర్ ఇచ్చాడు. దీంతో ఆ యువతికి 'కలుద్దా'మంటూ మెసేజ్ పెట్టాడు. ఆమె అంగీకరించడంతో ఇద్దరూ కలుసుకున్నారు. అంతే, అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే, ఆ రోజు దాదర్ మార్కెట్ లో ఏ యువతినైతే చూసి మనసు పారేసుకున్నాడో... సరిగ్గా తనే ఆమె! ఆమె కూడా అతని లాంటి సమస్యలతోనే బాధపడుతోంది. తామిద్దరం కలిసిపోవడానికి భవిష్యత్ కలలు కనడానికి సమయం పట్టలేదని, త్వరలోనే తామిద్దరం వివాహం చేసుకోవాలనుకుంటున్నామని ఆ యువకుడు ఆనందంతో పోస్ట్ చేశాడు. ఈ గాథ ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.