: బీహార్ లో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది: కేంద్ర ఎన్నికల సంఘం
బీహార్ అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని కేంద్రం ఎన్నికల ప్రధాన అధికారి నసీం జైదీ తెలిపారు. రాజకీయ పార్టీలు, ఇతర స్టేక్ హోల్డర్లు ఈ కోడ్ ను తప్పనిసరిగా అమలు చేయడానికి సహకరించాలన్నారు. కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరిస్తామని, సంఘ వ్యతిరేక శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. లైసెన్సుడు ఆయుధాలను తప్పనిసరిగా స్టేషన్లలో డిపాజిట్ చేయాలని, డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై దృష్టిపెడతామని పేర్కొన్నారు. బీహార్ లో మొత్తం 47 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. 38 జిల్లాలుండగా, 34 జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాలున్నాయని చెప్పారు. ఓటర్లకు ఫోటో ఓటరు కార్డులు, ఓటరు స్లిప్పులు ముందుగానే అందిస్తామని, తద్వారా వాళ్లకు ఓటు వేయాలన్న ఆహ్వానం అందినట్లవుతుందని తెలిపారు. ఈవీఎంలలో కూడా గుర్తులతో పాటు అభ్యర్థుల ఫోటోలు తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేశారు. ఒపీనియన్ పోల్స్ ను, ప్రకటనలను ఎన్నికకు 48 గంటల ముందు నుంచి నిషేధిస్తున్నామన్నారు.