: చరిత్ర పునరావృతం... అక్కపై నెగ్గిన చెల్లి: యూఎస్ ఓపెన్ సెమీస్ చేరిన సెరెనా
సిస్టర్స్ పోరులో చరిత్ర పునరావృతమైంది. అక్కపై చెల్లిదే పైచేయిగా నిలిచింది. ప్రతిష్ఠాత్మక యూఎస్ ఓపెన్ లో కొద్దిసేపటి క్రితం ముగిసిన ఆసక్తికర పోరులో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ తన సొంత అక్క వీనస్ విలియమ్స్ పై విజయం సాధించింది. దీంతో ఈ ఏడాదిలో ఇరువురి మధ్య జరిగిన రెండో మ్యాచ్ లోనూ చెల్లినే విజయం వరించినట్లైంది. మూడు సెట్ల పాటు సాగిన మ్యాచ్ లో సెరెనా విలియమ్స్ 6-2, 1-6, 6-3 స్కోరుతో వీనస్ పై విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విజయంతో సెరెనా విలియమ్స్ యూఎస్ ఒపెన్ సెమీస్ చేరింది. టైటిల్ కు మరో రెండడుగుల దూరంలో నిలిచింది. ఈ టైటిల్ ను కూడా చేజిక్కించుకుంటే సెరెనా విలియమ్స్ ఈ ఏడాదిలో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలిచి చరిత్ర పుటలకెక్కనుంది.