: మా వ్యాపారాలకు రక్షణ కల్పించండి: కేంద్రానికి అంబానీ, బిర్లాల వినతి
భారత్ లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలకు రక్షణ కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వివిధ దేశాల నుంచి చౌక ధరలకు దిగుమతి అవుతున్న టెక్స్ టైల్, ఉక్కు ఉత్పత్తులతో తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముఖేష్ అంబానీ, బిర్లా గ్రూప్ కంపెనీల అధిపతి కుమార మంగళం బిర్లా ప్రధాని మోదీకి తెలిపారు. చైనాలో నెలకొన్న సంక్షోభం కారణంగా అక్కడి ఉత్పత్తులు ఇండియాలోకి వెల్లువలా వస్తున్నాయని, దీన్ని అడ్డుకోవాలని వారు కోరినట్టు తెలుస్తోంది. చైనా దిగుమతులపై సుంకాలను పెంచడం ద్వారా వాటికి అడ్డుకట్ట వేయాలని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ సూచించారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఐరన్, స్టీల్ రంగంలో టాటా స్టీల్ ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేటు సంస్థగా సేవలందిస్తున్న సంగతి తెలిసిందే. చైనా సంక్షోభం కారణంగా అక్కడి నుంచి స్టీల్ ఉత్పత్తులు టన్నుకు 290 డాలర్లకే (సుమారు రూ. 19,140) ఇండియాకు వస్తున్నాయి. దేశవాళీ ధరలతో పోలిస్తే ఇది తక్కువ. దీంతో ప్రజలు చైనా ఉక్కు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని, దీని వల్ల మొత్తం పరిశ్రమకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందని సైరస్ అభిప్రాయపడ్డారు. పరిస్థితి అంతవరకూ వెళ్లకుండా తక్షణం చర్యలు చేపట్టాలని సూచించారు.