: కృష్ణా జిల్లాలోకి గోదారి ఎంట్రీ... పూర్ణకుంభంతో స్వాగతం పలికిన దేవినేని, చింతమనేని, మాగంటి
గోదావరి జలాలు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించాయి. కొద్దిసేపటి క్రితం కృష్ణా డెల్టా రైతులు, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎంపీ మాగంటి బాబులు పూర్ణకుంభంతో గోదావరి జలాలకు స్వాగతం పలికారు. తాటిపూడి ఎత్తిపోతల పథకం నుంచి రోజుకు 600 క్యూసెక్కుల చొప్పున పొలవరం కుడి కాలువలోకి విడుదలైన గోదావరి జలాలు నేటి ఉదయం పల్లెర్లమూడి వద్ద కృష్ణా జిల్లాలోకి ప్రవేశించాయి. నదుల అనుసంధానంలో బాగంగా గోదావరి జలాలను కృష్ణా నదిలో కలిపే క్రమంలో ఈ ఘట్టం కీలకమనే చెప్పాలి. కృష్ణా జిల్లాలోకి ప్రవేశించిన గోదావరి జలాలు నేటి సాయంత్రంలోగా కృష్ణా నదిలో కలవనున్నాయి. పల్లెర్లమూడి వద్దకు పెద్ద సంఖ్యలో రైతులతో కలిసి వచ్చిన టీడీపీ నేతలు చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబులు కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన మంత్రి దేవినేని నెహ్రూతో కలిసి వారు గోదావరి జలాలకు కృష్ణా జిల్లాలోకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యేలు, రైతులు గోదావరి జలాల్లో మునిగి చిరకాల స్వప్నం సాకారమైందని సంతోషం వ్యక్తం చేశారు.