: టాటూ స్టైల్ కాదు...సెక్స్ బానిసకు గుర్తు
టాటూలు స్టైల్ కు గుర్తు అని చాలా మంది భావిస్తుంటారు. సినిమా హీరోలు వేసుకున్నారన్న వ్యామోహంతో యువత వెర్రిగా టాటూ సంప్రదాయాన్ని అనుసరిస్తోంది. కానీ టాటూ వెనుక భయంకరమైన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పూర్వం పచ్చబొట్లను కొన్ని రకాల రుగ్మతలు నివారించేందుకు స్థానిక వైద్యుడి సలహాతో వేసుకునేవారు. ఆ తరువాత కొన్ని రకాల సంస్కృతులు పాటించే ప్రజలు వాటిని సంప్రదాయంగా చేసుకున్నారు. ఇప్పుడిప్పుడు సినిమా స్టార్లు ఒంటిపై టాటూతో దర్శనమిస్తుండడంతో యువతరం కూడా టాటూల వెంట పరిగెడుతున్నారు. అయితే అమెరికాలో టాటూలు సెక్స్ బానిసలను గుర్తించడానికి వాడతారు. సెక్స్ రాకెట్ నడిపే ముఠాలు ఆ రొంపిలోకి లాగబడిన యువతులకు గుర్తుగా టాటూలను వేసేవారు. ఈ సెక్స్ బానిసలకు చేతులు, పొత్తి కడుపు, మెడపై వేసే టాటూలను బార్ కోడ్ గా సెక్స్ రాకెట్లు వినియోగిస్తున్నాయి. ఈ టాటూలను బాధితులు 'వార్ ఊండ్స్'గా పిలుస్తారు. అయితే, వీరిలో టాటూ సంప్రదాయం రూపుమాపేందుకు 'సర్వైవర్ ఇంక్' అనే స్వచ్ఛంద సంస్థ కృషి చేస్తోంది. ఈ సంస్థ యజమానురాలు కూడా సెక్స్ రాకెట్ బాధితురాలే కావడం విశేషం. తన ఒంటిపైనున్న టాటూలు కనిపించకుండా ఉండేందుకు ఆమె చిత్రమైన అలంకరణను అనుసరిస్తోంది. ఉమెన్ ట్రాఫికింగ్ అంతర్జాతీయంగా 1.33 లక్షల కోట్ల రూపాయల వ్యాపారంగా వర్ధిల్లుతోందంటే దీని వెనుక ఎలాంటి శక్తులు పనిచేస్తున్నాయో ఊహించవచ్చు.