: ఇండియాకు తిరిగొచ్చిన విదేశీ పెట్టుబడిదారులు, దూసుకెళ్లిన మార్కెట్
గత కొద్ది సెషన్లుగా ఇండియాకు దూరమైన విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు తిరిగొచ్చారు. మంగళవారం నాటి సెషన్లో కొత్తగా ఈక్విటీ వాటాలను కొనుగోలు చేశారు. ఇదే సమయంలో దేశీయ ఇన్వెస్టర్లు, ఫండ్ కంపెనీలు సైతం కొనుగోళ్లకు ఉత్సాహం చూపడంతో సెషన్ ఆరంభంలో ఒడిదుడుకుల మధ్య సాగిన బెంచ్ మార్క్ సూచీలు, ఉదయం 11 గంటల తరువాత దూసుకెళ్లాయి. మొత్తం 2,771 కంపెనీలు ట్రేడింగ్ జరుపుకోగా, 1,464 కంపెనీలు లాభాపడ్డాయి. నేటి సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచి సెన్సెక్స్ 424.06 పాయింట్లు పెరిగి 1.70 శాతం లాభంతో 25,317.87 పాయింట్లకు చేరగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 129.45 పాయింట్లు పెరిగి 1.71 శాతం లాభంతో 7,688.25 పాయింట్లకు చేరింది. ఎన్ఎస్ఈ-50లో 45 కంపెనీల ఈక్విటీలు లాభాలను నమోదు చేసుకున్నాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 1.02 శాతం, స్మాల్ కాప్ 0.60 శాతం పెరిగాయి. ఈ సెషన్లో గెయిల్, యస్ బ్యాంక్, బీహెచ్ఈఎల్, టాటా స్టీల్, యాక్సిస్ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, కెయిర్న్ ఇండియా, హిందుస్థాన్ యూనీలివర్, బీపీసీఎల్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈ గణాంకాల ప్రకారం, లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 93.30 లక్షల కోట్లుగా ఉంది.