: పచ్చి నిజం... ఇండియాలో వాడుతున్న ఉత్పత్తుల్లో 20 శాతానికి పైగా నకిలీవే!


రోడ్ల పక్కన, రైల్వే స్టేషన్ల ముందు... ఎక్కడో ఒకచోట ప్రముఖ బ్రాండ్ల పేరున్న ఉత్పత్తులు తక్కువ రేటుకు కనిపిస్తూనే ఉంటాయి. అయితే, వీటిని కొనుగోలు చేసే ముందు అవి నకిలీవి అయ్యుంటాయన్న విషయాన్ని తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల కేపీఎంజీ, ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఇండియాలోని ఎఫ్ఎంసీజీ ఉత్పత్తుల్లో 20 శాతానికి పైగా నకిలీవేనని తేలింది. ఇదే సమయంలో అసలైన ఉత్పత్తుల అమ్మకాలతో పోలిస్తే, నకిలీ ఉత్పత్తుల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయని కూడా అధ్యయనం వెల్లడించింది. 2014 నాటికి నకిలీ వస్తువుల మార్కెట్ ఇండియాలో రూ. 1.05 లక్షల కోట్లు కాగా, అందులో ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన ప్రొడక్టుల విలువ రూ. 68 వేల కోట్లుగా ఉంది. ఈ సంవత్సరం గణాంకాలు మరింత ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయని ఫిక్కీ, కేపీఎంజీ నివేదిక అభిప్రాయపడింది. 2014లో ఎఫ్ఎంసీజీ సెక్టారులో రూ. 3.2 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని, ఈ సంవత్సరం ఆర్థిక కష్టాలు ఎదురైనా, అమ్మకాలు తగ్గలేదని ఈ అధ్యయన ఫలితాలు వెల్లడిస్తూ, ఫిక్కీ వెలువరించిన నివేదిక వెల్లడించింది. వచ్చే నాలుగేళ్లలో ఈ రంగంలో 11 నుంచి 12 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనాలు వేస్తున్నట్టు వెల్లడించిన కేపీఎంజీ కన్స్యూమర్ మార్కెట్స్ విభాగం హెడ్ రజత్ వాహి, అంతకు మించిన వృద్ధితో నకిలీ ఉత్పత్తులు మార్కెట్ ను ముంచెత్తనున్నాయని వివరించారు. ముంబై వంటి నగరాల్లో నకిలీలు సర్వసాధారణమైపోయాయని, వీటిని చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారని కూడా ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఇక చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ మార్కెట్ వ్యాపారులే నకిలీలను ప్రోత్సహిస్తూ, వాటి విక్రయాలకు సహకరిస్తున్నారని తెలిపింది. తక్కువ ధరకు వస్తుందన్న ఒకే ఒక్క కారణంగా ప్రజలు వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది.

  • Loading...

More Telugu News