: ఎప్పుడు వెళ్లినా వేచి ఉండాల్సిందే... ఇండియన్ల సహనానికి పరీక్ష పెట్టే క్యూలైన్లివే!
వేచి చూడటం... ఈ విషయంలో ఇండియన్లకు ఎంతో ఓపిక. ఎక్కడైనా ఎదురుచూడాల్సి వస్తే, స్మార్ట్ ఫోన్ తీసి నచ్చిన గేమ్ ఏదో ఆడుకుంటూ కూర్చోవడం సాధారణంగా చేస్తుంటాం. మరికొందరైతే, దగ్గరిదారిలో క్యూలో ముందుకు దూకేయడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తుంటారు. మనం ఎప్పుడు వెళ్లినా వేచిచూడక తప్పనిసరి పరిస్థితి ఉండే క్యూలైన్ల వివరాలివే... తిరుమల శ్రీవెంకటేశ్వరుని సన్నిధి: ఈ జాబితాలో తొలి స్థానం మన వెంకన్నదే. నిత్యమూ 80 నుంచి 90 వేల మంది భక్తులు వచ్చే చోట, దేవదేవుని దర్శించుకునేందుకు తన వంతు కోసం ఎవరైనా సరే వేచి చూడాల్సిందే. అయితే, పరపతి, హోదాను బట్టి వెయిటింగ్ చేయాల్సిన సమయం మారుతూ ఉంటుంది. ఒక్కోసారి క్యూలైన్లలో రోజంతా ఉండాల్సి వచ్చే ఏకైక లైన్లు ఇక్కడ మాత్రమే ఉంటాయి. పాస్ పోర్ట్ ఆఫీస్: పాస్ పోర్ట్ కాలపరిమితి పదేళ్లుగా ఉన్నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే. ఒకసారి దీన్ని పొందితే, పదేళ్లు మళ్లీ పాస్ పోర్ట్ ఆఫీస్ గడప తొక్కక్కర్లేదు అని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. పాస్ పోర్ట్ సంపాదించడమే ఓ ఘనత. అలా ఉంటుంది ఇక్కడి క్యూ. నిన్నమొన్నటి వరకూ రాత్రంతా క్యూలలో గడిపిన వారి సంఖ్య వేలల్లోనే ఉండగా, ఇప్పుడు ఆన్ లైన్ బుకింగ్ వల్ల పరిస్థితి కొంత మారింది. షిర్డీ సాయిబాబా టెంపుల్: తెల్లవారుఝామున 4 గంటలకు తెరచుకునే షిర్డీ సాయినాధుని దర్శించుకోవడం కోసం ముందు రోజు రాత్రి నుంచే భక్తులు బారులు తీరుతారు. ఇండియాలోని దేవాలయాలకు ఎప్పుడు వెళ్లినా భక్తులు ఉండే ఆలయాల్లో ఇదొకటి. రద్దీ సమయాన్ని బట్టి కనీసం గంట నుంచి 15 గంటల వరకూ దర్శనానికి క్యూలైన్లలో వేచివుండాల్సిందే. రైల్వే టికెట్ రిజర్వేషన్ కౌంటర్: రాత్రంతా క్యూలైన్లు కొనసాగే మరో చోటు రైల్వే రిజర్వేషన్ కౌంటర్. అనుకున్న సమయానికి రైల్లో ప్రయాణం కోసం ముందు రోజు నుంచే లైన్లలో పడిగాపులు పడేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. అత్యంత రద్దీగా ఉండే రైలు ఎక్కే ముందే, అంతే స్థాయిలో రద్దీ ఉండే కౌంటర్ల ముందు గంటల కొద్దీ ఎదురుచూడాల్సిందే. రేషన్ దుకాణాలు: నెలలో కొన్ని రోజుల పాటు మాత్రమే తెరచివుండే రేషన్ దుకాణాలకు వెళ్లి సరుకులు తెచ్చుకునే వారు కూడా గంటల కొద్దీ లైన్లలో నిలబడాల్సిందే. ప్రభుత్వం అందించే ఈ సరుకులను పొందుతున్న కుటుంబాల సంఖ్య ఇండియాలో 20 కోట్ల వరకూ ఉంది. ఈ కుటుంబాల్లోని ఎవరో ఒకరు నెలకోసారి గంట నుంచి మూడు, నాలుగు గంటల పాటు లైన్లో నిలబడి సరుకులు తెచ్చుకుంటారు. వీటితో పాటు సులభ్ సౌచాలయాలు, బ్యాంకులు నిత్యమూ క్యూలైన్లతో ఉంటాయి. వీటితో పాటు సీజన్ క్యూలైన్లుగా కాలేజీ అడ్మిషన్ల సమయం, బిగ్ బజార్ బిల్ కౌంటర్, సినిమా టికెట్ల లైన్లు, టీవీ చానళ్లు పెట్టే టాలెంట్ షో ఆడిషన్లు... ఇటువంటివి ఎన్నో భారతీయుల సహనాన్ని నిత్యమూ పరీక్షిస్తూనే ఉంటాయి.