: కర్నూలు జిల్లాలో జోరందుకున్న వజ్రాల వేట... ఎస్.రంగాపురానికి జనం బారులు
కర్నూలు జిల్లాలో వజ్రాల వేట జోరుగా సాగుతోంది. జిల్లాలోని ప్యాపిలి మండలం ఎస్.రంగాపురం గ్రామ పరిధిలోని పొలాల్లో జనం తండోపతండాలుగా కనిపిస్తున్నారు. ఆ గ్రామ వాసులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనం అక్కడి పొలాల వద్దకు క్యూ కడుతున్నారు. వర్షాలు కురవగానే ఇక్కడి పొలాల్లో నేలపై ఉన్న మట్టి కొట్టుకుపోయి వజ్రాలు బయటపడతాయి. వీటిని చేజిక్కించుకునేందుకు జనం వజ్రాల వేట సాగిస్తుండటం ఏటా ఇక్కడ సర్వ సాధారణమే. పొద్దునే పొలాల్లోకి పిల్లాపెద్దలతో తరలివెళ్లిపోయే జనం చీకటి పడే దాకా వజ్రాల వేటలోనే లీనమైపోతారు. గడచిన నాలుగు నెలల్లోనే ఇక్కడ దాదాపు 20 దాకా వజ్రాలు లభ్యమైనట్లు విశ్వసనీయ సమాచారం.