: సాకారమవుతున్న చంద్రబాబు స్వప్నం... గోదావరి జలాలకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన చింతమనేని


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కల ఫలిస్తోంది. రాయలసీమ నీటి అవసరాలను తీర్చేందుకంటూ టీడీపీ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టులో తొలి పంపు ఈ నెల 15 నుంచి పనిచేయడం ప్రారంభించనుంది. పట్టిసీమ ద్వారా పోలవరం కుడి కాలువ నుంచి బయలుదేరే గోదావరి జలాలు కృష్ణా జిల్లాలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలో కలవనున్నాయి. దీనికి ముందుగా తాటిపూడి ఎత్తిపోతల పథకం నుంచి పోలవరం కుడి ప్రధాన కాలువలోకి గోదారి నీటిని ఎత్తిపోసే కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. తాటిపూడి నుంచి కృష్ణా నదిలో కలిసేందుకు గోదావరి జలాలు పరుగులు పెడుతున్నాయి. రోజుకు 600 క్యూసెక్కుల చొప్పున విడుదలవుతున్న గోదావరి జలాలు ఇప్పటికే దాదాపు 150 కిలో మీటర్ల మేర ప్రయాణించాయి. మరో 70 కిలో మీటర్లు ప్రయాణిస్తే ప్రకాశం బ్యారేజీ వద్ద గోదావరి జలాలు కృష్ణమ్మ పాదాలను తాకుతాయి. ఈ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు అటు కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమ రైతాంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందులో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా జానాంపేట వద్ద గోదావరి జలాలకు ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రేపు గోదావరి జలాలు కృష్ణా నదిలో కలవనున్నాయి.

  • Loading...

More Telugu News