: రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట... నియోజకవర్గం దాటి ఎక్కడికైనా వెళ్లేందుకు అనుమతి
ఓటుకు నోటు కేసులో టి.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయన బెయిల్ పై ఉన్న ఆంక్షలను కోర్టు సడలించింది. నియోజకవర్గం కొడంగల్ దాటి ఎక్కడికైనా వెళ్లేందుకు కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. అయితే ప్రతి సోమవారం ఏసీబీ కార్యాలయంలో హాజరవ్వాలని రేవంత్ ను ఈ సందర్భంగా ఆదేశించింది. తాను ప్రజాప్రతినిధి అయినందున తరచూ రాజధాని హైదరాబాద్ కు వెళ్లాల్సి ఉంటుందని, త్వరలో తన కుమార్తె వివాహం ఉన్నందున పనులపై ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి ఉంటుందని తెలుపుతూ రేవంత్ కోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారించిన కోర్టు బెయిల్ పై ఆంక్షలు సడలించింది. ఓటుకు నోటు కేసులో బెయిల్ ఇచ్చిన సమయంలో నియోజవర్గంలోనే ఉండాలని కోర్టు రేవంత్ కు షరతు విధించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన కొన్ని నెలలుగా కొడంగల్ లోనే కుటుంబసభ్యులతో ఉంటున్నారు. తాజా తీర్పుతో ఇక నుంచి రేవంత్ హైదరాబాద్ వచ్చేందుకు మార్గం సుగమమైంది.