: పండమేరులో పదేళ్ల తరువాత వరద, సుంకేసుల గేట్లు ఎత్తివేత, శ్రీశైలానికి తరలుతున్న నీరు
దాదాపు పది సంవత్సరాల తరువాత అనంతపురం జిల్లాలో పండమేరు వరద నీటితో కళకళలాడుతోంది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతుండగా, చిన్న చిన్న నదులన్నీ నీటితో నిండిపోయాయి. దీంతో రాయలసీమ ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని 50కి పైగా చెరువులు నీటితో పూర్తిగా నిండాయి. కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు మంత్రాలయం వద్ద తుంగభద్రా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఈ నీరంతా సుంకేసుల రిజర్వాయర్ కు వస్తుండటంతో, నిల్వవున్న నీరు వరద గేట్లను తాకింది. వరద మరింత కాలం కొనసాగే అవకాశం ఉండటంతో, 5 గేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి అదనంగా కేసీ కెనాల్ ద్వారా కర్నూలు తాగునీటి అవసరాలకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేసుల నుంచి విడుదలవుతున్న నీరు ఈ సాయంత్రానికి శ్రీశైలం రిజర్వాయరుకు చేరే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు పెన్నా నదిలో సైతం వరదనీరు పెరుగుతోంది.