: అక్క గెలుస్తుందా?...లేక చరిత్ర పునరావృతమా?: యూఎస్ ఓపెన్ లో మరో ఆసక్తికర మ్యాచ్!
సంచనాల యూఎస్ ఓపెన్ తాజా సీజన్ మరో ఆసక్తికర మ్యాచ్ కు వేదిక కానుంది. విలియమ్స్ సిస్టర్స్ గా టెన్నిస్ ప్రపంచంలో వినుతికెక్కిన వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ మధ్య జరగనున్న యూఎస్ ఓపెన్ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది. హేమాహేమీలు ఇంటి బాట పడుతున్న తరుణంలో విలియమ్స్ సిస్టర్స్ ఇద్దరూ క్వార్టర్స్ చేరుకున్నారు. నేటి రాత్రి వీరిద్దరి మధ్య జరగనున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కోసం టెన్నిస్ అభిమానులు అమితాసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే వింబుల్డన్ నాలుగో రౌండ్ లో తలపడ్డ వీరిద్దరిలో చెల్లి సెరెనాదే పైచేయిగా నిలిచింది. తాజాగా నేడు జరగనున్న యూఎస్ ఓపెన్ క్వార్టర్స్ మ్యాచ్ లోనైనా అక్క వీనస్ గెలుస్తుందా? లేక చరిత్రను పునరావృతం చేస్తూ చెల్లి సెరెనానే విజయం సాధించి టైటిల్ కు మరో అడుగు చేరువవుతుందో చూడాలి. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఈ ఏడాదిలో ఇప్పటికే మూడు గ్రాండ్ టైటిల్స్ నెగ్గిన సెరెనా, చివరిదైన నాలుగో టైటిల్ వేటలోనూ ముందడుగు వేసినట్లవుతుంది.