: జర్మనీ మానవత్వం... శరణార్థులకు కానుకలతో స్వాగతం!
ఆ చిన్నారి విగతజీవుడిగా పడివున్న చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. యూరప్ మారిపోయింది. సిరియా, ఇరాన్ తదితర దేశాల నుంచి వస్తున్న శరణార్థులకు ఇప్పుడు యూరోపియన్ యూనియన్ స్వాగతం పలుకుతోంది. ఆశ్రయంకోరి జర్మనీలోకి వస్తున్న వారికి కానుకలు ఇస్తూ, స్వాగతం పలుకుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. లక్షల సంఖ్యలో శరణార్థులు వచ్చినా, తమ ఆర్థిక వ్యవస్థ దాన్ని ఎదుర్కోగలదని ఆ దేశ చాన్స్ లర్ ఏంజెలా మెర్కెల్ స్వయంగా ప్రకటించారు. ఈ ఏడాది 8 లక్షల మంది వరకూ తమ దేశానికి వస్తారని అంచనా వేస్తున్నామని, వీరికి వసతి, ఆశ్రయం కల్పించేందుకు 600 కోట్ల యూరోల బడ్జెట్ (సుమారు రూ. 7,500 కోట్లు) కేటాయించనున్నట్టు ఆమె తెలిపారు. మరోవైపు ఫ్రాన్స్ సైతం సిరియా నుంచి వస్తున్న వారికి ఆశ్రయమిస్తామని ప్రకటించింది. ఫ్రాన్స్, జర్మనీలు శరణార్థులకు అండగా నిలిచేందుకు ముందుకు రావడంతో, వివిధ యూరప్ దేశాలు అదే దారిలో నడవక తప్పనిసరి పరిస్థితి నెలకొంది. ఇదే సమయంలో తీరం వెంబడి వున్న గ్రీస్, ఇటలీ, హంగేరీలపై ఒత్తిడి తగ్గించేందుకు ఆ దేశానికి వస్తున్న వలసవాదులను తమ దేశాలకు తీసుకెళ్లేందుకు అంగీకరించాయి.