: రవాణా శాఖ చెక్ పోస్టులపై టీ ఏసీబీ దాడులు... భారీగా నగదు స్వాధీనం
అంతరాష్ట్ర సరిహద్దుల్లోని రవాణా శాఖ చెక్ పోస్టులపై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు చేశారు. పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత రాష్ట్రంలోని ప్రధాన చెక్ పోస్టులపై దాడులు చేశారు. మెదక్ జిల్లా జహీరాబాద్, నల్లగొండ జిల్లా రామాపురం, ఆదిలాబాదు జిల్లా వాంకిడి, నిజామాబాదు జిల్లా మద్నూర్ చెక్ పోస్టులపై దాడులు చేసిన అధికారులు, నిబంధనల మేరకు వసూలు చేసిన మొత్తాల కంటే పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించారు. సంబంధిత చెక్ పోస్టుల సిబ్బందిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు అదనంగా పోగేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు. చెక్ పోస్టుల్లో ఇంకా ఏసీబీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.