: రఘువీరారెడ్డి 'మేఘమధనం'పై విచారణ చేయబోతున్నాం: మంత్రి ప్రత్తిపాటి
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబులపై కాంగ్రెస్ నేతలు కేసులు పెట్టడాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీని పట్టించుకోరనే ఇలా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కు ఇంకా బుద్ధి రాలేదని, అందుకే వాళ్లకు ఒక్క సీటు కూడా రాకుండా ప్రజలు చేశారని మీడియా సమావేశంలో మండిపడ్డారు. అయినా సిగ్గు లేకుండా వారు చేసిన మోసాన్ని ప్రజలు మర్చిపోయారనుకుని అప్పుడే ఆందోళనలు మొదలెట్టారని కాంగ్రెస్ నేతలపై ఆయన ధ్వజమెత్తారు. వారి ప్రభుత్వంలో జరిగిన కుంభకోణాలపై విచారణ జరుపుతుంటే ఎన్నో వాస్తవాలు బయటకు వస్తున్నాయన్నారు. ముఖ్యంగా రఘువీరారెడ్డి మేఘమధనంపై విచారణ చేయబోతున్నట్టు వెల్లడించారు. దాని పేరుతో రూ.140 కోట్లు ఖర్చు చేశారని, ఇంకా నలభై కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. అప్పుడు విమానం లేవలేదు, వర్షం పడలేదు, అయినా డబ్బు మాత్రం ఖర్చయిందని పుల్లారావు విమర్శించారు. ఈ స్కాంపై విచారణను సీబీఐకి ఇవ్వాలా? లేక సీఐడీకి ఇవ్వాలా? అనేది సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని పేర్కొన్నారు.