: అధికార అహంకారానికి కేసీఆర్ నిదర్శనంగా నిలిచారు: జైపాల్ రెడ్డి
అధికార అహంకారానికి కేసీఆర్ నిదర్శనంగా నిలిచారని సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ ఆకాశంలో విహరిస్తూ పగటి కలలు కంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తొందరపాటు నిర్ణయాలతో పాలన అస్తవ్యస్తమైందన్నారు. 'రైతును రక్షిద్దాం' నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహబూబ్ నగర్ లో ఈ రోజు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో జైపాల్ రెడ్డి మాట్లాడుతూ ఆ విధంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టి.కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, చైనా పర్యటనకు బయలుదేరి వెళ్లిన సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో కరవు రాజ్యమేలుతుంటే సీఎం విహారయాత్రలు చేస్తున్నారన్నారు. చైనా పర్యటనతో ఎలాంటి ఉపయోగం లేదని ఎద్దేవా చేశారు. కరవు కోరల్లో చిక్కుకున్న రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని ఉత్తమ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇంకా డీకే అరుణ, పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు పాల్గొన్నారు.