: ఎర్రజెండోళ్ల వద్దకే వెళ్లండి... పారిశుద్ధ్య కార్మికులకు ముఖం మీదే చెప్పిన హరీశ్ రావు


‘‘ఎర్రజెండోళ్ల మాటలు విన్నారు. సమ్మె వద్దని సాక్షాత్తు సీఎం కేసీఆర్ వారించినా వినలేదు. ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. ఇప్పుడు నేనేం చేసేది? పోయి ఎర్రజెండోళ్ల ఇళ్ల వద్దే ధర్నాలు చేసుకోండి’’ అంటూ జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. నిన్న మెదక్ జిల్లా రామచంద్రాపురంలోని మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి ఇంటికి హరీశ్ రావు వచ్చారు. విషయం తెలుసుకున్న కార్మికులు తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని ఆయనను వేడుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు కార్మికులు చేసిన తప్పును వారి ముందే విప్పిచెప్పారు. ‘అధికారంలోకి వచ్చిన వెంటనే పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చీపురు పట్టుకున్న ఘనత ఒక్క కేసీఆర్ కే దక్కుతుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులను 'అన్నా నమస్తే' అని పలకరించిందీ కేసీఆరే. సమ్మె విరమించుకోమని, వేతనాలు పెంచుతామని సీఎం చెప్పినా వినకుండా సమ్మె చేశారు. సీఎం మాట విని 20 వేల మంది కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరి ఉద్యోగాలు కాపాడుకున్నారు. మిగతా 2 వేల మంది ఎర్రజెండోళ్ల మాట విని సమ్మె చేశారు. నౌకరీలు పోగొట్టుకున్నారు. సీఎం దండం పెట్టి ఇళ్లు కట్టిస్తానన్నా వినకపోతిరి. స్థానిక ఎమ్మెల్యే చెప్పినా మీరు వినలేదు. అందుకే తొలగించడం జరిగింది’’ అని హరీశ్ రావు కార్మికులకు తేల్చిచెప్పారు. అయితే ఎర్రజెండోళ్లను నమ్మి మోసపోయామని, న్యాయం చేయాలని కార్మికులు మంత్రిని వేడుకున్నారు. దీంతో కాస్తంత శాంతించిన హరీశ్ రావు, ఈ విషయాన్ని సీఎం వద్దకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు యత్నిస్తానని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News