: ఏ తరహాలోనైనా, ఎలాంటి యుద్ధానికైనా రెడీ: పాక్ ఆర్మీ చీఫ్
ఎటువంటి యుద్ధం చేయాల్సి వచ్చినా పాకిస్థాన్ సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఇండియాను ప్రస్తావిస్తూ, "పొరుగు దేశాల నుంచి ఎటువంటి ప్రమాదం వచ్చినా దాన్ని తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. సముద్ర యుద్ధమైనా, గగనతలమైనా, భూమిపై అయినా... ఎటువంటి ఆయుధాలతోనైనా పోరాడగలం" అని, 1965 ఇండియా, పాక్ యుద్ధం 50వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా జరిగిన కార్యక్రమంలో రహీల్ తెలిపారు. శత్రువులు ఏదైనా దుస్సాహసం చేస్తే, వారికి అపారనష్టం కలిగించే శక్తి తమ వద్ద ఉందని అన్నారు. ఆనాటి యుద్ధంలో పాక్ సైనికుల ప్రాణత్యాగాలను వృథాకానివ్వమని ఆయన తెలిపారు. ప్రస్తుతం శత్రువుల సైన్య బలం కన్నా పాక్ సైన్య బలమే అధికమని వివరించారు. కాశ్మీర్ అంశం పరిష్కారం కాకుండా ఉపఖండంలో శాంతి అసంభవమని, అక్కడి ప్రజల అభీష్టానికి అనుగుణంగా ఐక్యరాజ్యసమితి నడుచుకోవాలని సూచించారు.