: వరదొస్తే, రాజధానిలో నాలుగో వంతు మునకే: తేల్చిన సీఆర్డీయే
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ప్రాంతంలో సేకరించిన భూమిలో 10 వేల ఎకరాల వరకూ తరచూ ముంపునకు గురవుతోందని సీఆర్డీయే (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) తేల్చి చెప్పింది. ముఖ్యంగా కొండవీటి వాగు 29.50 కిలోమీటర్ల పొడవుండగా, 7,300 క్యూసెక్కుల వరదనీరు అమరావతి మీదుగా ప్రవహిస్తుందని, ఈ వరదకు 13,500 ఎకరాలు మునిగిపోతుండగా, అందులో 10,600 ఎకరాలు సమీకరించిన భూమిలో ఉందని వివరించింది. మొత్తం అమరావతి పరిధిలో నాలుగో వంతుకు పైగా వరదొస్తే నీట మునుగుతుందని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. తక్షణం కాంటూరు సర్వే చేయించాలని, వరద తీవ్రతను గుర్తించేందుకు నిపుణులైన హైడ్రాలజికల్ కన్సల్టెంట్ ను నియమించాలని సిఫార్సు చేసింది. కృష్ణా వరదకట్టల అడుగున ఇసుక, పూడిక ఏ మేరకు ఉందో తేల్చాలని కోరింది. కాగా, కృష్ణా బ్యారేజీ వద్ద నీటి అడుగు భాగంలో సర్వే కోసం ఐఐటీ టెక్నాలజీస్ ను కన్సల్టెంట్ గా నియమించిన ఏపీ సర్కారు 1.53 కోట్లకు కాంట్రాక్టు అప్పగించింది.