: అవును...మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం!: అమృత ప్రకటనను ధ్రువీకరించిన డిగ్గీరాజా
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ 68 ఏళ్ల వయసులో పెళ్లి పీటలు ఎక్కారు. తాను ప్రేమించిన టీవీ యాంకర్ అమృతా రాయ్ ని ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ మేరకు తమ పెళ్లిని అమృతా రాయ్ ఫేస్ బుక్ ద్వారా ప్రకటించారు. 44 ఏళ్ల వయసున్న అమృతా రాయ్ తో డిగ్గీరాజా ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే. తమ మధ్య ప్రేమ వ్యవహారాన్ని ఇదివరకే డిగ్గీరాజా అంగీకరించారు కూడా. ప్రస్తుతం డిగ్గీరాజా అమెరికా పర్యటనలో ఉన్నారు. అమృతా రాయ్ కూడా తాను పనిచేస్తున్న చానెల్ లో సెలవు పెట్టి మరీ వెళ్లారట. డిగ్గీరాజా, అమృతా రాయ్ లు పెళ్లి చేసుకున్నారని నిన్న ఓ ఆంగ్ల దినపత్రిక కథనం రాసిన సంగతి తెలిసిందే. ఈ కథనం నేపథ్యంలోనే అమృతా రాయ్ ఫేస్ బుక్ లో స్పందించారు. డిగ్గీరాజాతో తన పెళ్లి జరిగిపోయిందని ఆమె ప్రకటించారు. అమృతా రాయ్ ప్రకటనను డిగ్గీరాజా కూడా ధ్రువీకరించారు.