: ఏఐసీసీ పదవి కావాలా?... గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు సిద్ధం కావాల్సిందే!
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం హోదాకు అవసరమైన మెజారిటీ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీలోని ప్రధాన విభాగం ‘ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ’ (ఏఐసీసీ)ని సమూలంగా ప్రక్షాళన చేసేందుకు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఈ దఫా ఏఐసీసీ పదవులు కావాలనుకునే వారిని ఎంపిక చేసే విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన నిర్ణయించారు. ఇందులో భాగంగా ఏఐసీసీ పదవులను ఆశిస్తున్న పార్టీ నేతలకు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు ఆయన ఆహ్వానం పలుకుతున్నారు. ఇప్పటికే ఏఐసీసీ పదవుల కోసం దాదాపుగా 3 వేల మందికి పైగా నేతలు దరఖాస్తు చేసుకున్నారట. వీరిలో ఆయా నేతల హోదా, అనుభవం, వారి నేపథ్యాన్ని బట్టి తులనాత్మక పరిశీలన జరిపి 150 మందితో రాహుల్ గాంధీ ఓ జాబితాను రూపొందించారు. ఈ జాబితాలోని వారిని గ్రూపుల వారీగా విభజించి ఒక్కో గ్రూపులో ఏడుగురి దాకా చేర్చారు. వీరికి తొలుత గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ కనబరచిన వారిని ఒక్కో గ్రూపు నుంచి ముగ్గురు నుంచి నలుగురిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. వారితో నేరుగా రాహుల్ గాంధీ ముఖాముఖీగా మాట్లాడతారు. గ్రూప్ డిస్కషన్ తో పాటు ఇంటర్వ్యూలోనూ మెరుగ్గా రాణించిన వారికే ఈ దఫా ఏఐసీసీ పదవులను కట్టబెడతారట.