: గుంటూరు, ఏలూరుకు పాకిన తెలుగు హీరోల అభిమానుల నిరసనలు
భీమవరంలో మొదలైన పవన్ కల్యాణ్, ప్రభాస్ అభిమానుల ఘర్షణలు గుంటూరు, ఏలూరు నగరాలకు విస్తరించాయి. గత రాత్రి గుంటూరులోని కొన్ని ప్రాంతాల్లో ఒక హీరో అభిమానుల ప్లెక్సీలను మరో హీరో అభిమానులు ధ్వంసం చేశారని ఆరోపిస్తూ, కొందరు రోడ్లపై నిరసనలు తెలిపారు. ఏలూరులోనూ ఇదే తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ ప్లెక్సీలకు కొందరు దుండగులు నిప్పు పెట్టారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి చెయ్యి దాటకుండా చర్యలు చేపట్టారు. భీమవరంలో 144 సెక్షన్ అమలు చేస్తున్న పోలీసులు, గుంటూరు, ఏలూరు ప్రాంతాల్లో ప్రత్యేక పోలీసు పికెట్లను ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. అభిమానులు హద్దులు దాటితే ఊరుకోబోమని మైకుల్లో ప్రచారం చేస్తున్నారు. అభిమాన సంఘాల నిరసనలు సాధారణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. అభిమాన సంఘాల ముసుగులో సామాజిక వర్గాల ఆధిపత్య అలజడి వైరస్ లా విస్తరిస్తూ, విధ్వంసాలకు దారితీస్తుండటం భయాందోళనలు పెంచుతోంది. కాగా, దుగ్గిరాల మండలం చింతలపూడిలోనూ, పవన్ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలను కొందరు ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. దీనికి ప్రతిగా కృష్ణాష్టమి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆయన చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని గత రాత్రి కొందరు అంటించారు. అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు.