: 15 లక్షల మందితో అతిపెద్ద ర్యాలీ: హార్దిక్ పటేల్
నేడు తాము తలపెట్టిన రివర్స్ దండి యాత్రను వచ్చే ఆదివారానికి వాయిదా వేసుకుంటున్నట్టు గుజరాత్ యువ నేత హార్దిక్ పటేల్ ప్రకటించారు. 13వ తేదీన ర్యాలీ జరుగుతుందని, దండిలో 78 మందితో మొదలయ్యే యాత్ర సూరత్ కు వచ్చే లోపు 5 లక్షల మంది, అహ్మదాబాద్ కు చేరే లోపు 15 లక్షల మంది పటేల్ వర్గీయులను కలుపుకుంటుందని, దీంతో ప్రభుత్వానికి కనువిప్పు ఖాయమని ఆయన అన్నారు. రాష్ట్ర చరిత్రలో జరిగే అతిపెద్ద ర్యాలీగా ఇది నిలుస్తుందని తెలిపారు. కాగా, రివర్స్ దండి యాత్రను వాస్తవానికి నేడు జరపాలని ముందుగా నిర్ణయించారు. అయితే, ఇటీవలి పటేల్ ర్యాలీలో నెలకొన్న హింసాత్మక ఘటనల దృష్ట్యా, దీనికి అనుమతి ఇచ్చేందుకు గుజరాత్ సర్కారు నిరాకరించింది. దీంతో ర్యాలీని వచ్చే వారానికి వాయిదా వేసుకుంటున్నామని, ఆనాడు అనుమతి వచ్చినా, రాకున్నా ర్యాలీ జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం అర్ధరాత్రి ఆయనో ప్రకటన వెలువరించారు. ఇదిలావుండగా, హార్దిక్ మీద పటేళ్లలో వ్యతిరేకత పెరుగుతోంది. వివిధ ప్రాంతాల్లో 30 మందికి పైగా పటేల్ వర్గ కన్వీనర్లుండగా, వీరిలో మూడొంతుల మంది తనను వ్యతిరేకిస్తే, నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని హార్దిక్ తెలియజేశారు.