: అతను సాహసానికి మారుపేరు... మహత్తర త్యాగానికి అసలు పేరు!
సాహసానికి, మహత్తర త్యాగానికి ఆయన మారుపేరు. పదకొండు రోజుల్లో పదిమంది ఉగ్రవాదులను మట్టు బెట్టాడు. దేశ సేవలో వీరమరణం పొందాడు. పరదేశ చీడపురుగులను మనదేశంలో అడుగుపెట్టకుండా చేసి, చివరకు అసువులు బాసిన అమర జవాన్ ల్యాన్స్ నాయక్ మోహన్ నాథ్ గోస్వామి. ఆర్మీలో స్పెషల్ ఫోర్సెస్ కమాండోగా నిబద్ధతతో ఆయన విధులు నిర్వహించాడు. గురువారం నాడు హన్ద్వారాలో మిలిటెంట్లతో జరిగిన భీకర పోరులో మోహన్ ప్రాణాలర్పించాడు. గత పదకొండు రోజుల్లో కాశ్మీర్ లోయలో జరిగిన మూడు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ లో మోహన్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నాడు. 10 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టాడు. ఒక ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నాడు. ఆర్మీలోని పారా కమాండో సంస్థలో 2002లో మోహన్ స్వచ్ఛందంగా చేరాడు. వాళ్ల యూనిట్ లో పేరు ప్రఖ్యాతులు పొందిన సోల్జర్ గా నిలిచాడు. మోహన్ ఉన్న ఆర్మీ యూనిట్ తలపెట్టిన అన్ని ఆపరేషన్లలోను ఆయన పాలుపంచుకున్నాడు. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ లో నిర్వహించిన కౌంటర్ టెర్రరిస్టు ఆపరేషన్లలో విజయం సాధించిన వాటన్నింట్లో ఆయన చురుకుగా వ్యవహరించాడు. ఆగస్టు 23న ఖర్ముర్, హన్ద్వారాలో ఆపరేషన్లు ప్రారంభించాడు. పాకిస్థాన్ లష్కరే తోయిబాకు చెందిన కరుడుగట్టిన ముగ్గురు టెర్రరిస్టులను కాల్చిపారేశాడు. ఆగస్టు 26, 27 తేదీలలో రెండు రోజుల పాటు కాశ్మీర్లోని రఫియాబాద్ లో బాక్ టు బాక్ ఆపరేషన్ లో కూడా మోహన్ తన సత్తా చాటాడు. ఉగ్రవాదులకు, కమాండోలకు మధ్య జరిగిన హోరాహోరి కాల్పుల్లో మరో ముగ్గురు లష్కరే తోయిబా మిలిటెంట్లను మోహన్ హత మార్చాడు. ఈ ఆపరేషన్ లో లష్కరే తోయిబాకు చెందిన మిలిటెంటు సజ్జద్ అహ్మద్ అలియాస్ అబూ ఉదయ్ తుల్లా ప్రాణాలతో పట్టుబడ్డాడు. కుప్వారాకు సమీపంలోని దట్టమైన అడవి ప్రాంతం హఫ్రూదాలో మిలిటెంట్లపై జరిగిన పోరులో కూడా మోహన్ ఉన్నాడు. ఇక్కడ భీకరమైన ఎదురు కాల్పులు పరస్పరం జరిగాయి. దేశమాత సేవలో ప్రాణాలర్పించిన అమర జవాన్ మోహన్ కు సైనిక లాంఛనాలతో ఆయన స్వగ్రామమైన రాయ్ బరేలిలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.