: ప్రపంచాన్ని కన్నీరు పెట్టించిన మూడు ఫోటోల కథ...!


నాన్న భూజాలపై ఆడుకుంటూ, అమ్మ ఒడిలో సేదదీరుతూ శైశవగీతం పాడాల్సిన వయసులో ప్రాణభయంతో పరుగు, తీరం చేరకుండానే మృత్యువును కౌగిలించుకోవడం! మత మౌఢ్యంతో తీవ్రవాదుల దుశ్చర్యలకు, ప్రభుత్వాల అధికార దాహంతో జరిగే రాక్షస క్రీడకు బలవుతున్న అభాగ్యులు ఎందరో... అలాంటి ముగ్గురి దీన గాథలు ప్రపంచాన్ని కదిలించాయి. ఏం జరుగుతోంది? ఎందుకీ జంతు క్రీడ? అన్నెంపున్నెం ఎరుగని చిన్నారులకెందుకీ శిక్ష? అంటూ ముక్త కంఠంతో ప్రశ్నిస్తున్నారు. 1972లో వియత్నాంలో నాపాం బాంబు దాడిలో ఒళ్లంతా కాలిన గాయాలతో మంట భరించలేక బట్టలన్నీ విప్పేసి, నడి రోడ్డుపై ప్రాణభయంతో పరుగెత్తిన ఫాన్ ది కిమ్ ఫుట్ ఫోటో యుద్ధోన్మాదుల రాక్షస క్రీడను ప్రపంచాన్ని తట్టి లేపింది. ఎందుకీ యుద్ధోన్మాదం? అంటూ నినదించేలా చేసింది. గొప్ప విషయం ఏంటంటే, ఒళ్లంతా కాలినా, ప్రాణభయంతో పరుగెత్తినా కిమ్ ఫుట్ ను ఎన్నో ఆపన్న హస్తాలు ఆదుకున్నాయి. కాపాడి కెనడాలో స్వేచ్ఛా జీవనం ప్రసాదించాయి. పాలస్తీనాలోని గాజాస్ట్రిప్ లో తండ్రితో పాటు నడుచుకుంటూ వెళ్లడమే మహ్మద్ అల్ దుర్రా (12) చేసిన నేరం. ప్రాణభయంతో కొడుకుని పొదివి పట్టుకుని గోడ చాటున తండ్రి దాక్కున్న ఆల్ దుర్రాను ఆ రక్త పిపాసులు వదల్లేదు. నిర్దయగా కాల్చేశారు. తండ్రి ఒడిలో సేదదీరుతున్నట్టే దుర్రా నేలకొరిగితే, కొడుకును రక్షించుకోలేని నిస్సహాయ తండ్రిలా చూస్తూ నేలకొరిగాడు. ఫ్రెంచ్ ఛానెల్ ప్రసారం చేసిన ఈ ఘటన ప్రపంచాన్ని మరోసారి ఏకం చేసింది. పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలంటూ నినదించింది. 2015లో సిిరియాలో ఐఎస్ఐఎస్ క్రూరత్వాన్ని భరించలేక, ప్రాణభయంతో పసి ప్రాయాన్ని కూడా మరచి దేశం దాటుతూ, సముద్రుడి ఒడిలో సేదదీరుతున్నట్టు శాశ్వతంగా నిద్రపోయిన మూడేళ్ల అయలాన్ కుర్దీ మృతదేహం మరోసారి ప్రపంచాన్ని తట్టి లేపింది. మతం మాటున జరుగుతున్న మారణహోమాన్ని ఆపాలంటూ నినదిస్తోంది.

  • Loading...

More Telugu News