: ఆ చేతి రాత రిషితేశ్వరిదే!... నిర్ధారించిన ఫోరెన్సిక్ నిపుణులు
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సీనియర్ల వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న బీఆర్క్ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనకు సంబంధించి కీలకమైన ఫోరెన్సిక్ నివేదిక కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా ఎస్పీకి అందింది. కోర్టు ఆదేశాలతో గుంటూరు జిల్లా పోలీసులు రిషితేశ్వరి రాసిన సూసైడ్ నోట్, రెండు డైరీలు, నాలుగు నోట్ బుక్స్ ను హైదరాబాదులోని ఫోరెన్సిక్ ల్యాబోరేటరీకి పంపిన సంగతి తెలిసిందే. వీటిని సునిశితంగా పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు సమగ్ర నివేదికను గుంటూరు ఎస్పీకి అందజేశారు. సూసైడ్ నోట్, రెండు డైరీల్లోని చేతి రాత రిషితేశ్వరిదేనని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిపై కఠిన చర్యలకు దాదాపు రంగం సిద్ధమైనట్లుగానే కనిపిస్తోంది.