: రైతుల గోడు పట్టదా?... కేసీఆర్ చైనా పర్యటనపై ఎన్డీటీవీ విమర్శనాత్మక కథనం
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ నెల 8న చైనా పర్యటనకు వెళుతున్నారు. కేసీఆర్ చైనా పర్యటనకు వినియోగిస్తున్న ప్రత్యేక విమానం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏకంగా రూ.2 కోట్లను వెచ్చిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే నిమిత్తం కేసీఆర్ ఈ పర్యటన జరుపుతున్నారు. కేసీఆర్ పర్యటనపై ఇప్పటికే రాష్ట్రంలోని విపక్షాలు ఘాటు విమర్శలు చేశాయి. తాజాగా ప్రముఖ ఆంగ్ల టీవీ చానెల్ ‘ఎన్డీటీవీ’ నేటి ఉదయం విమర్శనాత్మక కథనాన్ని ప్రసారం చేసింది. సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో నిత్యం రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా, వాటిని పట్టించుకోని సీఎం చైనా పర్యటనకు రూ.2 కోట్లు ఖర్చు చేయడం అవసరమా? అంటూ ఆ కథనం ప్రశ్నించింది. మెదక్ జిల్లా రైతులతో పాటు స్థానిక ప్రజా సంఘాల నేతల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఎన్డీటీవీ ప్రసారం చేసిన ఆ కథనం తెలంగాణలో కలకలం రేపుతోంది.