: ప్రాణహిత డిజైన్ మార్పును వ్యతిరేకించండి... గవర్నర్ కు రంగారెడ్డి జిల్లా అఖిలపక్ష నేతల ఫిర్యాదు
తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను ఈరోజు రంగారెడ్డి జిల్లా అఖిలపక్ష నేతలు కలిశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు రీడిజైన్ ను వ్యతిరేకించాలని, దానివల్ల తాగు, సాగునీరు అందక ఇబ్బందులు పడతారని గవర్నర్ కు తెలిపారు. ఈ మేరకు ప్రాజెక్ట్ డిజైన్ ను వ్యతిరేకిస్తూ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు. గవర్నర్ ను కలసిన వారిలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, టీడీపీ నేత ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్యే వివేక్, రామ్మోహన్ రెడ్డి, వైసీపీ, సీపీఐ, బీజేపీ నేతలు ఉన్నారు. అనంతరం మీడియాతో మాజీ మంత్రి ప్రసాద్ మాట్లాడుతూ, అసలు డిజైన్ మార్చాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు. గోదావరి జలాలను రంగారెడ్డి జిల్లాకు ఇవ్వాల్సిందేనన్నారు. ప్రాణహితపై సీఎంతో మాట్లాడాలని గవర్నర్ ను కోరామని టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. డిజైన్ మార్పు విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గకుంటే పోరాడతామన్నారు.